గజల్ శ్రీనివాస్ పై మాట మార్చిన మంత్రి మాణిక్యాలరావు... ఉరేసినా పాపం లేదన్న ఏపీ మినిస్టర్!

  • గజల్ శ్రీనివాస్ తనకు చిన్నప్పటి నుంచీ తెలుసని నిన్న వ్యాఖ్యానించిన ఏపీ మంత్రి
  • ఆయన్ను సమర్థిస్తూ చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నా
  • నేను నాణానికి ఒకవైపు మాత్రమే చూశా: మాణిక్యాలరావు
గాయకుడు గజల్ శ్రీనివాస్ తనకు చిన్నప్పటి నుంచి తెలుసునని, అతను అమ్మాయిలను లైంగికంగా వేధించేవాడు కాదని నిన్న వ్యాఖ్యానించిన ఏపీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఈ ఉదయం మాట మార్చారు. అతనిపై కావాలనే కుట్ర చేశారని బుధవారం మీడియా ముందు చెప్పిన ఆయన, నేడు తానలా మాట్లాడినందుకు సిగ్గు పడుతున్నానని అన్నారు. గజల్ శ్రీనివాస్ ను సమర్థిస్తూ తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నానని చెప్పారు.

 తాను శ్రీనివాస్ కామ కలాపాల వీడియోలను రాత్రే చూశానని, ఆపై ఎంతో సిగ్గు పడ్డానని, షాక్ తిన్నానని అన్నారు. అతనిని ఉరి తీసినా తప్పు లేదని చెప్పిన మాణిక్యాలరావు, శ్రీనివాస్ ను తాను నాణానికి ఒకవైపు మాత్రమే చూశానని, ఇలా చేసే వ్యక్తని ఎన్నడూ అనుకోలేదని చెప్పారు. గజల్ శ్రీనివాస్ వంటి వ్యక్తులకు సమాజంలో ఉండే అర్హత లేదని మాణిక్యాలరావు వ్యాఖ్యానించారు. ఆయనపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.
Go Back to Shorts
ghajal Srinivas
Manikyala Rao
AP Minister
Sesual Harrasment

More Telugu News